: పాక్ దిగజారుడుతనం!... సార్క్ భేటీలో రాజ్ నాథ్ 8 సార్లు టాయిలెట్ కు వెళ్లారని ప్రచారం!
భారత్ పట్ల పాకిస్థాన్ మరోమారు తన దిగజారుడు నైజాన్ని చూపింది. ఇటీవల పాక్ రాజధాని ఇస్లామాబాదులో జరిగిన సార్క్ భేటీకి హాజరైన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కదలికపై తప్పుడు ప్రచారం చేసింది. సార్క్ హోం శాఖ మంత్రులు పాల్గొన్న సదరు భేటీలో రాజ్ నాథ్ సింగ్ ఏకంగా 8 సార్లు టాయిలెట్ కు వెళ్లారని పాక్ వర్గాలు అక్కడ ప్రచారం చేశాయి. భారత రాజధాని ఢిల్లీలోని తన శాఖ అధికారులతో చర్చలు జరిపేందుకు రాజ్ నాథ్ టాయిలెట్ లోకి వెళ్లి సెల్ ఫోన్ లో మాట్లాడారని ఆ దేశ వర్గాలు ప్రచారం చేశాయి. వాస్తవానికి సదరు సమావేశంలో రెండు సార్లు మాత్రమే రాజ్ నాథ్ సమావేశ వేదిక బయట ఉన్న టాయిలెట్లకు వెళ్లారు. మరో ఆశ్చర్యకర విషయమేంటంటే... రాజ్ నాథ్ సింగ్ విదేశాల్లో కాకుండా స్వదేశీ పర్యటనల్లోనూ అసలు సెల్ ఫోనే వాడరు. పర్యటనల్లోనే కాకుండా ఢిల్లీలో ఉన్న సమయంలోనూ ఆయన చేతిలో మొబైల్ ఫోన్ కనిపించదు. ఏదైనా అత్యవసరమనుకుంటే తన వెంట ఉండే వారి వద్ద ఉండే తన సెల్ ఫోన్ ను ఆయన వాడతారట. ఈ విషయాలను ఏమాత్రం పట్టించుకోని పాక్ వర్గాలు... ఢిల్లీలోని తన శాఖ అధికారులతో మాట్లాడేందుకు రాజ్ నాథ్ 8 సార్లు టాయిలెట్ కు వెళ్లారని, టాయిలెట్ లోనే ఆయన తన సెల్ ఫోన్ తీసి మోదీకి ఫోన్ చేశారని దిగజారుడు ప్రచారం చేశాయి.