: రియోలో సత్తాచాటిన భారత హాకీ మహిళల టీం.. జపాన్‌తో మ్యాచ్ డ్రా
దాదాపు 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన భారత మహిళల హాకీ జట్టు అంచనాలకు తగ్గట్టుగానే ఆడింది. పూల్-బి మ్యాచ్‌లో జపాన్‌తో తలపడిన భారత్ 2-2తో గోల్స్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. మ్యాచ్ ప్రారంభం నుంచి అదరగొట్టిన భారత జట్టు ప్రపంచ ర్యాకింగ్స్‌లో తనకంటే మెరుగైన స్థానంలో ఉన్న జపాన్‌కు ముచ్చెమటలు పోయించింది. ఒకదశలో ఓటమి ఖాయమనుకున్న పరిస్థితికి వెళ్లినా అనూహ్యంగా పుంజుకుంది. అయితే చివర్లో అందివచ్చిన అవకాశాలను వినియోగించుకోలేక డ్రాతో సరిపెట్టుకుంది. 15వ నిమిషంలో ఎమి నిషికోరి, 28వ నిమిషంలో మీ నకషిమా గోల్స్ చేయడంతో తొలి అర్ధభాగంలో జపాన్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత భారత్ అమ్మాయిలు విజృంభించారు. 31వ నిమిషంలో రాణి రాంపాల్, 40వ నిమిషంలో లిలిమా మింజ్ స్వల్ప వ్యవధిలోనే గోల్స్ చేసి ఓటమి నుంచి జట్టును గట్టెక్కించారు. మంగళవారం గ్రేట్ బ్రిటన్‌తో భారత మహిళల జట్టు తలపడనుంది.