: హైదరాబాద్లో స్వయంగా చేనేత రాట్నం వడికిన యాంకర్ ఝాన్సీ
చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర స్వరాజ్ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు చేనేత అవగాహన నడక జరిగింది. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ప్రొ.కోదండరాం, యాంకర్, నటి ఝాన్సీ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఝాన్సీ రాట్నం వడకడం అందరినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చేనేత ఒక కులానికి, వర్గానికి సంబంధించింది కాదని.. ఇది ఒక రంగానికి సంబంధించిందని అన్నారు. చేనేత వస్త్రాలను ఎంతో మంది ధరిస్తున్నారని, వాటిని పక్కరాష్ట్రాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో చేనేతను ప్రోత్సహించాలని అన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి చేనేత వస్త్రాలను ధరించాలని సూచించారు. చేనేత ఉనికిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతపై మరింత దృష్టి పెట్టాలని కోరారు.