: తెలంగాణ సర్కార్ అసదుద్దీన్ ఒవైసీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్
మోదీ రాక తెలంగాణలో బీజేపీ శ్రేణులకి ఎంతో ఉత్సాహాన్నిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తోన్న మహా సమ్మేళనం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మోదీ తెలంగాణ అభివృద్ధికి సాయం అందిస్తున్నారని అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు సక్రమంగా వినియోగం అవ్వాలని అన్నారు. హైదరాబాద్ ఎంపీ అసరుద్దీన్ ఒవైసీకి అనుకూలంగా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని, మజ్లిస్ ఒత్తిడికి ప్రభుత్వం లొంగిపోతోందని ఆరోపించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు కూడా అధికంగా కొనసాగుతున్నాయని, కండువాలు మార్చుతూ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? అన్న అనుమానం వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వానికి కోర్టులంటే లెక్కలేదని, విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదని, వారసత్వ రాజకీయాలు నడిపిస్తోందని లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. ఎటువంటి భేదాలు చూపకుండా అన్ని రాష్ట్రాలకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని ఆయన అన్నారు. యూఎస్ కాంగ్రెస్ నుంచి ప్రపంచంలోని అన్ని సమాజాలు మోదీకి బ్రహ్మరథం పడుతున్నాయని అన్నారు. ఎన్డీఏ పాలనలో కేంద్రంలో అవినీతిరహిత పాలన కొనసాగుతోందని, మోదీ పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశం పరువంతా పోయిందని, ఇప్పుడు యూపీఏ, ఎన్డీఏ మధ్య పాలనలోని తేడాని ప్రజలు గమనిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు.