: తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. కేసీఆర్ తనను కలిసిన ప్రతిసారీ అభివృద్ధి పనుల గురించే మాట్లాడారని వ్యాఖ్య
మెదక్ జిల్లా గజ్వేల్లోని కోమటిబండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈరోజు ప్రధాని నరేంద్రమోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ప్రధానిగా తొలిసారిగా తెలంగాణలో అడుగుపెట్టానని అన్నారు. తాగు, సాగునీరు అంశంలో కేసీఆర్ ఎప్పుడూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారని ఆయన చెప్పారు. కేసీఆర్ సీఎం అయ్యాక తనను చాలా సార్లు కలిశారని, కేసీఆర్ తనను కలిసిన ప్రతిసారీ అభివృద్ధి పనుల గురించే మాట్లాడారని మోదీ అన్నారు. కేసీఆర్ చేసిన పని ఆదర్శనీయమయినదని మోదీ పేర్కొన్నారు. తెలంగాణలో అనేక వనరులు ఉన్నాయని, వాటిని సమర్థంగా ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. ఈనాటి కార్యక్రమం పంచశక్తుల ఆవిష్కారంగా అనిపించిందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భుజం భుజం కలిపితే ఇలాంటి మంచి ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. రైతులకి నీరందిస్తే మట్టిలో బంగారం పండిస్తారని ఆయన అన్నారు. దేశంలో అతి తక్కువ వయసున్న రాష్ట్రం తెలంగాణ అని, రాష్ట్రంలో అభివృద్థి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని ఆయన ప్రశంసించారు.