: మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన కేసీఆర్
మెదక్ జిల్లా గజ్వేల్లోని కోమటిబండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ నాయకత్వంలో దేశంలో అవినీతిరహిత పాలన కొనసాగుతోందని ఆయన అన్నారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రాలకు నిధులు పెంచారని పేర్కొన్నారు. తెలంగాణకు నిధులిచ్చినందుకు ధన్యవాదాలని అన్నారు. తెలంగాణకు హడ్కోరుణం మంజూరయిందని కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2009లో తాను పంజాబ్లో మోదీని కలిసినప్పుడు మోదీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతు పలికారని, తనలో ధైర్యం నింపారని కేసీఆర్ అన్నారు. 'కొత్తరాష్ట్రానికి మీరందిస్తోన్న సహాయసహకారాలు మరవలేనివ'ని ఆయన అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ మంచి అభివృద్ధి చెందుతోందని ఆయన వ్యాఖ్యానించారు.