: పుష్కరాలకు పుష్కల నీరు... సంగమేశ్వరంలో రూ. 2 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే!
ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి పుష్కలంగా నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలానికి ఎగువన ఉన్న రిజర్వాయర్ ప్రాంతంలోని సంగమేశ్వరం వద్ద తెలంగాణ సర్కారు నిర్మించిన పుష్కర ఘాట్లు, ఇతర ఏర్పాట్లు, యాత్రికుల కోసం నిర్మించిన షెడ్లు నీట మునిగాయి. ఈ పనుల కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ. 2 కోట్ల వరకూ ఖర్చు పెట్టగా, ఈ డబ్బంతా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరైంది. ఈ పుష్కరాల్లో సంగమేశ్వరం వద్ద నిర్మించిన ఘాట్లను వినియోగించుకునే అవకాశాలు ఇప్పుడు లేవు. పుష్కరాల్లోగా సంగమేశ్వర ప్రాంతం పూర్తిగా మునిగేంత నీరు వస్తుందన్న ఆలోచన ముందుగా లేకపోవడంతోనే నది లోతట్టు ప్రాంతంలో నూతన ఘాట్ల నిర్మాణానికి టెండర్లు పిలిచి, పనులు పూర్తి చేయించారు. కాగా, ఈ మధ్యాహ్నం శ్రీశైలానికి వస్తున్న వరదనీరు లక్ష క్యూసెక్కులుగా ఉంది.