: పప్పుల ధరలు దిగొచ్చే సమయం... ఐదేళ్ల గరిష్ఠస్థాయికి దిగుబడి!


రెండు మూడు నెలల క్రితం రూ. 200 దాటిన కిలో కందిపప్పు ధర ప్రస్తుతం రూ. 180 వద్ద కొనసాగుతుండగా, ఈ ధర మరింతగా తగ్గనుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ సంవత్సరం పప్పు ధాన్యాల దిగుబడి గడచిన ఐదేళ్లలోనే గరిష్ఠంగా రానుందని, ముఖ్యంగా కందిపప్పు విషయంలో 55 శాతం అధిక విస్తీర్ణంలో పంట చేతికి అందనుందని ప్రభుత్వం విడుదల చేసిన కరీఫ్ పంటల నిర్వహణ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015 సీజనుతో పోలిస్తే పప్పు ధాన్యాల పంటలు 35 శాతం అధిక విస్తీర్ణంలో ఉన్నాయి. పెరిగిన ధాన్యాల ధరలను చూసిన రైతులు కందిపప్పు వేసేందుకు అధిక ఆసక్తిని చూపారని నిపుణులు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో సోయా బీన్స్ పండించే వారు, గుజరాత్ లో పత్తి, ఆముదాలకు మాత్రమే పరిమితమైన రైతులు, కర్ణాటక, తెలంగాణ రైతులు ఈ సంవత్సరం పప్పు ధాన్యాల పంటలకు మారిపోయారని డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. మొత్తం 8.85 కోట్ల హెక్టార్లలో ఖరీఫ్ సాగవుతోందని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 5.19 శాతం అధికమని తెలిపాయి. వర్షాలు సంతృప్తికరంగా కురుస్తుండటంతో పంట దిగుబడి సైతం ఆశాజనకంగా కనిపిస్తూ ఉందని, దిగుబడి మార్కెట్ కు వస్తే ధరలు తగ్గుతాయని పేర్కొంది. ఇక వరి విషయానికి వస్తే, గత సంవత్సరంతో పోలిస్తే 2.12 శాతం అధికంగా 2.81 కోట్ల హెక్టార్లలో పంట చేతికి రానుందని, తృణ ధాన్యపు పంటలు 3.22 శాతం అధికంగా 1.63 కోట్ల హెక్టార్లలో పండుతోందని, పత్తి 96 లక్షల హెక్టార్లలో సాగవుతోందని గణాంకాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News