: టీవీ చూడొద్దని తల్లిదండ్రులు మందలించారని హైదరాబాద్‌లో బాలిక ఆత్మహత్య
అస్తమానం టీవీ చూడొద్దని మందలిస్తుండడంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ శివారులోని సూరారంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం స్థానికంగా నివసించే సంజయ్ సింగ్ ఓ కంపెనీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు, రియా కుమారి సింగ్(12) అనే కుమార్తె ఉంది. రియాకు టీవీ చూడడమంటే ఎంతో ఇష్టం. గంటల తరబడి టీవీ వద్ద గడుపుతుండంతో పలుమార్లు తల్లిదండ్రులు ఆమెను మందలించారు. రోజూ తనను అదే పనిగా మందలిస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రియా కుమారి శుక్రవారం తల్లిదండ్రులు పనులకు వెళ్లిపోయిన తర్వాత ఇంటి వద్దే ఉండిపోయింది. తాను తర్వాత వస్తానని చెప్పి అన్నదమ్ములను స్కూలుకు పంపింది. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వచ్చిన సోదరులు లోపలి నుంచి గడియపెట్టి ఉండడం, ఎంతకీ తీయకపోవడంతో ఇరుగుపొరుగు సాయంతో తలపులు తెరిచి చూశారు. ఇంట్లో ఉరివేసుకుని కనిపించిన రియాను చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.