: పాక్ జైల్లో భారతీయుడిపై దాడి... సర్వసాధారణమని తీసిపారేసిన అధికారులు
నకిలీ గుర్తింపు కార్డును కలిగివున్నాడన్న కారణంగా పాకిస్థాన్ లో అరెస్టై పెషావర్ జైల్లో మూడేళ్ల శిక్ష అనుభవిస్తున్న భారతీయుడు హమీద్ నెహాల్ అన్సారీపై దాడి జరిగింది. పాక్ పత్రిక 'డాన్' కథనం ప్రకారం, అన్సారీపై ఓ పాకిస్థాన్ ఖైదీ విచక్షణా రహితంగా దాడి చేశాడు. అతన్ని రోజూ హింసిస్తున్నారని, ఆయనకు ప్రత్యేక భద్రత కల్పించాలని కోరుతూ అన్సారీ తరఫు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. జైలు అధికారులు మాత్రం ఇటువంటి సంఘటనలు చాలా సాధారణమని, అన్సారీకి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని వివరించారు. ఆయన్ను కనీసం ఆసుపత్రికి కూడా తరలించలేదని తెలుస్తోంది. పాక్ జైళ్లలో మగ్గుతున్న భారత ఖైదీలపై తరచూ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.