: మళ్లీ వార్తల్లోకెక్కిన సల్విందర్ సింగ్!... ‘పఠాన్ కోట్’ మిస్టరీ కాప్ పై రేప్ కేసు!
పంజాబ్ సీనియర్ పోలీసు అధికారి సల్విందర్ సింగ్ గుర్తున్నారా? పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డ సమయంలో దేశమంతటా ఆయన పేరు మారుమోగిపోయింది. నాడు పఠాన్ కోట్ కు సమీపంలోనే ఉన్న గురుదాస్ పూర్ జిల్లా ఎస్పీగా ఉన్న సల్వీందర్... రోడ్డు పక్కగా గాయాలతో పడి ఉన్న స్థితిలో కనిపించాడు. పఠాన్ కోట్ పై మెరుపు దాడి చేసిన ఉగ్రవాదులు సల్విందర్ అధికారిక వాహనంలోనే ఎయిర్ బేస్ సమీప ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో ఉగ్రవాదులకు సల్విందర్ సహకారమందించినట్లు నాడు ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలో ఆయనను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు విడతల వారీగా విచారించారు. తాజాగా మరోమారు సల్విందర్ సింగ్ వార్తల్లోకెక్కారు. ప్రస్తుతం పంజాబ్ లోని 75 బెటాలియన్ కమాండెంట్ గా ఉన్న సల్విందర్ పై నిన్న గురుదాస్ పూర్ లో రేప్ కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం అందిన ఓ ఫిర్యాదుపై చాలా ఆలస్యంగా స్పందించిన గురుదాస్ పూర్ పోలీసులు నిన్న సల్విందర్ పై ఈ కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదైంది. పఠాన్ కోట్ ఉగ్ర దాడికి సహకరించారని ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలోనూ సల్విందర్ పై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. రెండేళ్ల క్రితం అందిన ఫిర్యాదు ఆధారంగా ఇప్పుడు ఆయనపై తొలి ఎఫ్ఐఆర్ నమోదు కావడం గమనార్హం.