: గంటకో అడుగు చొప్పున పెరుగుతున్న శ్రీశైలం జలాశయం... 1.8 లక్షల క్యూసెక్కులకు పెరిగిన వరద ప్రవాహం
ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి, రాయలసీమ వాసులకు ఇదే నిజమైన శుభవార్త. ఎగువన కురిసిన వర్షాలతో వరద పోటెత్తగా, శ్రీశైలం జలాశయం జెట్ స్పీడుతో పెరుగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులను దాటుకుని కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే, శ్రీశైలంలోకి వస్తున్న వరద నీటి ప్రవాహం ఈ ఉదయం 1,79,283 క్యూసెక్కులకు పెరిగింది. ఈ ప్రవాహంతో గంటకో అడుగు చొప్పున జలాశయంలో నీటి మట్టం పెరుగుతుందని అధికారులు వెల్లడించారు. జలాశయంలోని విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో ప్రారంభం కాగా, 21,958 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 831.70 అడుగుల మేరకు నీరు నిల్వ ఉంది.