: పడుతూ లేస్తూ సాగిన స్టాక్ మార్కెట్!
జీఎస్టీ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినప్పటికీ, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నూతన కొనుగోళ్ల దిశగా సాగలేదు. సెషన్ ఆరంభంలో క్రితం ముగింపుతో పోలిస్తే, 150 పాయింట్లకు పైగా లాభంలో నిలిచిన సెన్సెక్స్, ఆపై నిమిషాల వ్యవధిలో 50 పాయింట్లకు పైగా నష్టపోయింది. తిరిగి కొంత మేరకు కొనుగోళ్లు కనిపించగా, లాభాల్లోకి వెళ్లి కూడా మళ్లీ కిందకు జారింది. పడుతూ లేస్తూ సాగిన సెషన్ ముగిసేసరికి బెంచ్ మార్క్ సూచికలు నామమాత్రపు లాభాల్లో కొనసాగాయి. ఇదే సమయంలో చిన్న, మధ్య తరహా కంపెనీల్లో మాత్రం కొంతమేరకు కొనుగోళ్లు కనిపించాయి. గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 16.86 పాయింట్లు పెరిగి 0.06 శాతం లాభంతో 27,714.37 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 6.25 పాయింట్లు పెరిగి 0.07 శాతం లాభంతో 8,551.10 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.38 శాతం, స్మాల్ కాప్ 0.39 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 12 కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. హెచ్సీఎల్ టెక్, ఇన్ ఫ్రాటెల్, సిప్లా, అదానీ పెయింట్స్, బోష్ లిమిటెడ్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, బీహెచ్ఈఎల్, ఐటీసీ, టాటా మోటార్స్, మారుతి సుజుకి తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,865 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,430 కంపెనీలు లాభాలను, 1,264 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బుధవారం నాడు రూ. 1,07,26,837 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,07,57,994 కోట్లకు పెరిగింది.