: పది వేల గదులతో సౌదీలో కొలువుదీరిన మహాద్భుత హోటల్!
మామూలుగా పెద్ద హోటల్ అంటే ఐదారు వందల గదులతో ఉంటుంది. కొన్ని హోటళ్లు ఓ 1000 గదులతో ఉన్నవి కూడా ఉన్నాయి. కానీ, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్. వచ్చే సంవత్సరంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే దీనిలో ఎన్ని గదులు ఉన్నాయో ఊహించగలరా? 10 వేలు. అంతేకాదు, ఇందులో వండి వడ్డించేందుకు 70 రెస్టారెంట్లు కూడా ఉంటాయి. దీని పేరు అబ్రాజ్ కుడాయ్. సౌదీ అరేబియాలోని మక్కాలో దీన్ని ప్రభుత్వమే స్వయంగా నిర్మించింది. మక్కాలోని ప్రధాన మసీదుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ హోటల్ ఉండటంతో, మక్కా సీజన్ లో ఈ హోటల్ కిటకిటలాడుతుందని అంచనా వేస్తున్నారు. దీని నిర్మాణానికి అంచనా వ్యయం రూ. 24,500 కోట్లు. దాల్ అల్ - హంద్ షా అనే గ్రూప్ ఇచ్చిన హోటల్ డిజైనులో ప్రధాన భవంతి చుట్టూ టవర్ల మాదిరిగా ఆరు నిర్మాణాలు, వాటిపై ఆరు హెలిపాడ్లు ఉంటాయి. ఈ టవర్ల మధ్యలోనే 25 అంతస్తుల్లో హోటల్ గదులూ ఉంటాయి.