: ఏ పప్పు తింటారు?... ఏ వరుసైన వారితో వేళాకోలం ఆడతారు?: బీసీలకు మంజునాథ కమిషన్ వింత ప్రశ్నలు!


ఏపీలో కాపులకు రిజర్వేషన్ కల్పించాలా? వద్దా? అన్న అంశాన్ని తేల్చేందుకు రంగంలోకి దిగిన జస్టిస్ మంజునాథ కమిషన్ సెప్టెంబరు నుంచి మూడు నెలల పాటు జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనుంది. ఏఏ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు అవసరం, ఎవరికి అవసరం లేదు, రిజర్వేషన్లకు అవసరమైన అర్హత ఆయా కులాలకు ఉందా? అన్న విషయాలపై కాస్తంత లోతుగా పరిశీలన చేయనున్న కమిషన్... ఇందుకోసం భారీ ప్రశ్నావళినే సిద్ధం చేసుకుంది. బీసీల్లోని ఆయా కులాలకు చెందిన జీవన స్థితిగతులు, వారి ఆర్థిక స్థితిగతులను తేల్చేందుకే కమిషన్ ఈ భారీ కసరత్తు చేస్తోంది. బీసీల గుర్తింపులో ఆర్థిక అంశాల కన్నా సామాజిక అంశాలదే ఎక్కువ ప్రాధాన్యం. ఈ కోణంలోనే ఆలోచించిన మంజునాథ కమిషన్... ఆయా బీసీ కులాల సామాజిక కోణాలను పరికించి చూసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం 214 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని చేతబట్టుకుని సెప్టెంబరు నుంచి మంజునాథ కమిషన్ జిల్లాలపై పడనుంది. ఈ ప్రశ్నల్లో కొన్ని సీరియస్ ప్రశ్నలున్నా... చాలా ప్రశ్నలు సిల్లీగా తోస్తున్నాయి. మీరు కన్యాశుల్కం తీసుకుంటారా? లేక మీ వర్గంలో వరకట్నం అమల్లో ఉందా?... మీరు ఏ పప్పు తింటారు? వంటల్లో ఏ నూనె వాడతారు? బంధువర్గంలో ఎలాంటి వరుసైన వారితో వేళాకోలం ఆడతారు? మాంసం తింటారా? తింటే అందులో చేపలు ఎక్కువగా తీసుకుంటారా? లేదంటే మేక మాంసం ఇష్టంగా తింటారా? మద్యం సేవిస్తారా? పొగ తాగుతారా? పండ్లు ఏ స్థాయిలో తీసుకుంటారు? బియ్యం, జొన్నలు, గోధుమలు, రాగులలో వేటిని ఎక్కువగా తీసుకుంటారు? ఎలాంటి సంతలకెళతారు?... మనిషి చనిపోయిన తర్వాత పూడ్చిపెడతారా? లేదంటే దహనం చేస్తారా? కర్మకాండల విషయంలో మీ ఆచారం ఏమిటి?... వంటి ప్రశ్నలు మంజునాథ కమిషన్ నుంచి బీసీలకు ఎదురుకానున్నట్లు సమాచారం. చూడటానికి మనకు ఈ ప్రశ్నలన్నీ సిల్లీగా అనిపించినా, వీటికి ఆయా వర్గాలు ఇచ్చే సమాధానాలను బట్టి వారు బీసీలా? కాదా? అన్న విషయం తేలిపోతుందని కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ప్రశ్నలకు బీసీలు ఎలా స్పందిస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News