: మరో నాలుగు నెలలు కోల్డ్ స్టోరేజ్ లోనే ప్రత్యేక హోదా బిల్లు... రేపు రాజ్యసభకు సెలవు?
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ ప్రైవేటు మెంబర్ బిల్లు రూపంలో పార్లమెంటులో పెట్టిన ప్రత్యేక హోదా బిల్లుపై రేపు చర్చ, ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్న ఏపీ ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రైవేటు మెంబర్ బిల్లులను ప్రతి రెండో శుక్రవారం నాడు సభలో ప్రవేశపెడతారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 12 రోజుల క్రితం తీవ్ర గందరగోళం మధ్య శుక్రవారం నాటి సభ వాయిదా పడగా, బిల్లును రేపు తీసుకు వస్తామని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక రేపు ఉత్తరాదిన 'తీజ్' పండగ. వ్యాపారులు తమ వ్యాపార వృద్ధి కోసం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. దక్షిణాదిన తొలి శ్రావణ శుక్రవారం కూడా. పర్వదినం కాబట్టి శుక్రవారం సెలవు ప్రకటించాలని ఉత్తరాది ఎంపీలు కోరుతున్నారు. అదే జరిగితే నాలుగు నెలల తరువాత జరిగే శీతాకాల సమావేశాల వరకూ కేవీపీ బిల్లు కోల్డ్ స్టోరేజ్ లోనే ఉండిపోతుంది. ఎందుకంటే, మళ్లీ రెండో శుక్రవారం వచ్చేంత వరకూ రాజ్యసభ పనిచేయదు కాబట్టి. సెలవు విషయమై కురియన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.