: టీడీపీ అంటే... తెలుగు డ్రామా పార్టీ!: జైరాం రమేశ్ విసుర్లు
ఏపీిలో అధికార పార్టీ టీడీపీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ కొత్త పేరు పెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదాపై అటు బీజేపీతో పాటు ఇటు టీడీపీ కూడా చిత్తశుద్ధిగా వ్యవహరించడం లేదని నిన్న ఢిల్లీలో ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఆయన టీడీపీ పేరుకు కొత్త అర్థం చెప్పారు. టీడీపీ అంటే.. ‘తెలుగుదేశం పార్టీ’ కాదన్న ఆయన ‘తెలుగు డ్రామా పార్టీ’ అని పేర్కొన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఏపీకి ఇప్పటికిప్పుడే ప్రత్యేక హోదాను అమలు చేసే వీలుందని కూడా ఆయన చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి అడ్డంకులు కూడా లేవని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కీలక ప్రసంగం చేసిన సమయంలో సభలో లేకుండా పోయారంటూ తనపై టీడీపీ ఎంపీలు చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. జైట్లీ ప్రసంగం చేసిన రోజున తన మామగారు చనిపోయారని, దీంతో తాను ఉన్నపళంగా చెన్నై వెళ్లాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ విషయం తెలుసుకోకుండా టీడీపీ ఎంపీలు తనపై నోరు పారేసుకోవడం సబబు కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.