: కూతురుకు పాలు పట్టిన క్రిస్ గేల్!... సోషల్ మీడియాలో ఫొటో వైరల్!
క్రిస్ గేల్ ఏంటీ?... కుదురుగా కూర్చుని కూతురుకు పాలు పట్టడమేమిటి? అనేగా మీ డౌటు. ప్రస్తుతం సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ‘ఇన్ స్టాగ్రాం’లో ప్రత్యక్షమైన ఓ ఫొటో చూస్తే గేల్ లోని తండ్రి కోణం కూడా మనకు ఇట్టే అర్థమైపోతుంది. మైదానంలో బ్యాటుతో వీరవిహారం చేస్తున్న గేల్... మైదానం వెలుపల మాత్రం అమ్మాయిలతో జల్సాలు, అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ వివాదాస్పద క్రికెటర్ గా అప్రతిష్ఠ మూటగట్టుకున్నాడు. అయితే ఇటీవలే క్రిస్ గేల్ భార్య ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు ‘బ్లష్’ అని పేరు పెట్టుకున్న గేల్... బోసి నవ్వుల పాపను చూసి సంబరపడిపోతున్నాడు. పాప రాకతో తండ్రిగా మారిపోయిన గేల్ లో ఒక్కసారిగా పెద్ద మార్పే వచ్చినట్లుంది. కూతురుతో కాలక్షేపం చేసేందుకు అతడు ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ ను కూడా వదులుకున్నాడట. ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటున్న గేల్... ముద్దులొలికే కూతురికి పాలు పడుతున్నాడట. ఇలా పాపకు పాలు పడుతున్న ఫొటోను క్లిక్ మనిపించుకున్న గేల్... దానిని ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. గేల్ ను కొత్త పాత్రలో చూపించిన సదరు ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.