: విశాఖలో మాయలేడి!... గిల్టు నగలతో బ్యాంకును బురిడీ కొట్టించిన వైనం!


విశాఖపట్నంలో మరో మాయలేడి టోకరా వేసిన ఘటన వెలుగుచూసింది. గిల్టు నగలతో బ్యాంకు అధికారులను బురిడీ కొట్టించిన సదరు మహిళ బ్యాంకు నుంచి లక్షలాది రూపాయల రుణాలను తీసుకుంది. తీరా మోసం బయటపడటంతో సదరు మాయలేడి ప్రస్తుతం కటకటాల వెనక్కెళ్లిపోయింది. వివరాల్లోకెళితే... విశాఖకు చెందిన సత్యసుమ అనే మహిళ నగరంలోని కరూర్ వైశ్యా బ్యాంకులో నగలను కుదువ పెట్టి రుణం తీసుకుంది. ఈ రుణాన్ని చెల్లించకుండానే ఆమె మరోమారు మరిన్ని నగలతో బ్యాంకుకు వెళ్లింది. బ్యాంకుకు చెందిన ఓ అధికారిని మ్యానేజ్ చేసిన ఆమె పాత రుణం తీర్చకుండానే కొత్త రుణం తీసుకుంది. ఇలా నెలన్నరలోనే సత్యసుమ పలుమార్లు బ్యాంకుకు వెళ్లింది. ఆమె పలుమార్లు బ్యాంకుకు నగలను తీసుకొస్తుండటంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు ఆమె కుదువ పెట్టిన నగలను పరిశీలించారు. దీంతో సత్యసుమ పెట్టిన నగలన్నీ గిల్టు నగలని తేలిపోయింది. షాక్ తిన్న బ్యాంకు అధికారులు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను, ఆమెకు సహకరించిన సురేశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ఆమె వద్ద స్వల్ప మోతాదులో వున్న అసలు నగలు, రూ.4.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News