: జపాన్ నుంచి చీపుర్లు తెప్పించాం.. మంత్రుల ఇంటి ముందు రోడ్లు ఊడ్చుతున్నాం: రఘువీరా
ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తూ నిన్న చేసిన రాష్ట్రబంద్ విజయవంతమయిందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బంద్ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందని అన్నారు. టీడీపీ, బీజేపీ నేతలు కేవీపీ పెట్టిన ప్రవేటు బిల్లు పాస్ అయ్యే విధంగా బాధ్యతను తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అంశంలో రోజుకోమాట మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఆయనకు చేతకాకపోతే సీఎం కుర్చీ నుంచి తప్పుకోవాలని వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హోదా అంశాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని రఘువీరా ఆరోపించారు. ‘కేంద్రం నుంచి ఎటువంటి హామీ రాలేదు.. అయినా టీడీపీ ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది’ అని ఆయన అన్నారు. టీడీపీ సొంత ప్రయోజనాల కోసమే ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు, వెంకయ్య నాయుడి ఇంటి ముందు ఈరోజు తమ పార్టీ నిరసనలు చేపడుతున్నట్లు రఘువీరా పేర్కొన్నారు. వారి ఇంటి ముందు రోడ్లు శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. దాని కోసం ప్రత్యేకంగా జపాన్ నుంచి చీపుర్లు తెప్పించామని ఆయన వ్యాఖ్యానించారు.