: బంజారాహిల్స్లో లారీ బీభత్సం.. తప్పిన ప్రమాదం
హైదరాబాద్లోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్ మీదుగా ఉండే బంజారాహిల్స్ రోడ్డు నెంబరు-2 పేరు వింటేనే ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవలే అక్కడ చిన్నారి రమ్యతో పాటు ఆమె కుటుంబంలోని మరో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం ఓ ఇసుక లారీ ఫ్లైఓవర్ పైనుంచి బోల్తా పడింది. తాజాగా అక్కడ కంకరలోడుతో వెళుతోన్న ఓ లారీ సృష్టించిన బీభత్సంతో స్థానికులు మరోసారి ఉలిక్కిపడ్డారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ మీదుగా బంజారాహిల్స్ వైపు వెళుతుండగా రోడ్డు నెంబరు-2లో లారీ ఒక్కసారిగా అదుపుతప్పింది. అక్కడి డివైడర్ పైకెక్కి నిలిచిపోయింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని పరిశీలించారు.