: బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ ప్రతిపక్షాల కుట్రే!: అజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ ఘటనను రాజకీయ పార్టీలు తమ స్వార్థానికి ఉపయోగించుకోవడం ప్రారంభించాయి. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నేతలు ప్రభుత్వం విఫలమైందని, మహిళలకు అఖిలేష్ సర్కారు రక్షణ కల్పించలేకపోతోందని ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన సమాజ్ వాదీ పార్టీ మంత్రి, వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అజంఖాన్ మాట్లాడుతూ, అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని అప్రదిష్ఠపాలు చేసేందుకు బులంద్ షహర్ ఘటనను ప్రతిపక్షాల కుట్రగా భావిస్తున్నామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తులో వాస్తవాలు వెల్లడవుతాయని, ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలనుకుంటున్న ప్రతిపక్షాల కుట్ర ఈ ఘటన వెనుక ఉందా? అన్నది దర్యాప్తు చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఓట్ల కోసం ప్రతిపక్షాలు ఎంతకైనా దిగజారుతున్నాయని ఆయన ఆరోపించారు. ఓట్ల కోసం ముజఫర్ నగర్, షామ్లి, కైరానా వంటి ఘటనలు జరిగినప్పుడు... ఈ ఘటనలో మాత్రం ఓట్ల రాజకీయం ఎందుకు ఉండకూడదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అధికారం కోసం రాజకీయ నాయకులు అమాయక ప్రజల్ని చంపేందుకు కూడా వెనుకాడరని ఆయన ఆరోపించారు. కులమతాల పేరు చెప్పి అల్లర్లు సృష్టించి, అమాయక ప్రజల్ని బలి తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ ఘటనలో నిజానిజాలు వెల్లడి కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం మానవత్వముంటే ఈ ఘటనపై రాజకీయాలు చేయకుండా నిందితుల్ని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.