: చంద్రబాబుతో మాట్లాడా...త్వరలోనే సమస్యకు పరిష్కారం: లోక్ సభలో జైట్లీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లుతున్నాయి. ఈ నేపధ్యంలో లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలంతా కలిసికట్టుగా ఆందోళన నిర్వహిస్తుండడంతో జీరో అవర్ తరువాత సభ రెండుసార్లు వాయిదా పడింది. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశించి, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సమస్యలు తమకు తెలుసని అన్నారు. సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తాను మాట్లాడానని అన్నారు. ఆయనతో అన్ని విషయాలు చర్చించానని ఆయన తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి విషయాన్ని నెరవేరుస్తామని ఆయన తెలిపారు (ఇదే ప్రకటన రాజ్యసభలో చేసిన సంగతి తెలిసిందే). విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే అందుకు కొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు. దీంతో ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రెండేళ్లు ముగిశాయి. ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి?' అని ఆయన నిలదీశారు. దీనికి ఆయన సమాధానమిస్తూ, అన్ని అంశాలపై మీ అధినేత, ముఖ్యమంత్రితో చర్చిస్తున్నామని అన్నారు. ఎంపీల ఆందోళనను అర్థం చేసుకున్నామని ఆయన తెలిపారు.