: ఏపీ ఎంపీల నినాదాల హోరు!... లోక్ సభను వాయిదా వేసిన స్పీకర్!
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీ ఎంపీల నిరసనలతో లోక్ సభ కార్యకలాపాలు స్తంభించాయి. నేటి ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే అప్పటిదాకా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కొనసాగించిన టీడీపీ, వైసీపీ ఎంపీలు ప్లకార్డులతోనే సభలో అడుగుపెట్టారు. తాము ప్రతిపాదించిన వాయిదా తీర్మానం మేరకు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చకు అనుమతించాలని టీడీపీ ఎంపీలు నినాదాలు చేశారు. మరోవైపు వైసీపీ ఎంపీలు కూడా ‘హోదా’ డిమాండ్ తో స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఏపీ ఎంపీల నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలను ముగించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ నినాదాలు చేస్తున్న ఎంపీలను నిలువరించే యత్నం చేశారు. అయితే ఎంపీల నినాదాలు ఏమాత్రం సద్దుమణగకపోవడంతో సభను పావు గంట పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.