: విరాళాల రూపంలో ఫీజులు ఇద్దురుగాని... ముందు చదువుకోండి!: ఐఐటీయన్లకు ఖరగ్ పూర్ బంపరాఫర్
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల కోతను ఎదుర్కొంటున్న ఖరగ్ పూర్ ఐఐటీ, నిధుల సమీకరణ కోసం కొత్త మార్గాన్ని ఎంచుకుంది. విద్యార్థులు ఎవరైనా, ఉద్యోగం తెచ్చుకున్న తరువాత ఫీజులు చెల్లిస్తామని అంగీకరిస్తే, వారు చెల్లించాల్సిన ఫీజులను మాఫీ చేస్తామని చెబుతూ 'లెర్న్ - ఎర్న్ - రిటర్న్ ఫండ్' పథకాన్ని ప్రకటించింది. విద్యను అభ్యసించి, ఆపై ఉద్యోగం తెచ్చుకుని డబ్బు సంపాదించడం ప్రారంభించిన తరువాత, కళాశాలకు విరాళాల రూపంలో చెల్లించేలా రూపొందించినదే ఈ కొత్త పథకం. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులు ఈ స్కీములో చేరి ఫీజు మినహాయింపులు పొందవచ్చని ఐఐటీ డైరెక్టర్ పార్థ ప్రతీమ్ చక్రవర్తి వెల్లడించారు. ఉద్యోగం వచ్చిన తరువాత ఏడాదికి కనీసం రూ. 10 వేల చొప్పున చెల్లించాల్సి వుంటుందని, తమ పూర్వ విద్యార్థులలో కనీసం 30 వేల మంది ఈ విధంగా విరాళమిచ్చినా అది ఏడాదికి రూ. 30 కోట్లు అవుతుందని ఆయన అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వార్డ్ యూనివర్శిటీలో 60 శాతం బడ్జెట్ నిధులు ఈ తరహాలో విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థుల ద్వారానే లభిస్తున్నాయని గుర్తు చేశారు. ప్రతిభ, ఆర్థిక స్తోమత ఆధారంగా గ్రేడింగ్ పద్ధతిలో ఈ స్కీముకి విద్యార్థులను ఎంపిక చేస్తారు. 100 లోపు ర్యాంకు తెచ్చుకుని ఈ ఏడాది మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు కూడా ఈ స్కీము వర్తిస్తుంది. కాగా, ఈ ఏడాది నుంచి ఐఐటీలలో బీటెక్ కోర్సు ఫీజు 90000 నుంచి 2 లక్షల రూపాయలకు పెంచిన సంగతి విదితమే!