: గుండెల్లోని బాధ బయటపడ్డ వేళ... సల్మాన్ ఖాన్ కంట కన్నీరు
తనలోని నటుడిని గుర్తించి, సినీ భిక్షపెట్టి, నేడు ఇంతటి వాడు కావడానికి కారణమైన కుటుంబంలోని రజ్జత్ బర్జాత్యా సంస్మరణ సభకు సల్మాన్ ఖాన్ వెళ్లిన వేళ, ఆయన గుండెల్లోని బాధ బద్దలై కన్నీటి రూపంలో బయటకు వచ్చింది. శుక్రవారం నాడు బర్జాత్యా మరణించగా, ఆదివారం సాయంత్రం ఆయన సంస్కరణ సభ ముంబయ్ లోని రంగశారదా ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తన చెల్లెలు అల్విరాతో కలసి వచ్చిన సల్మాన్, ఓ మూలన చాలా సేపు నిలబడ్డాడు. భజన జరుగుతూ ఉండగా, నిర్మాత మహేష్ భట్ కూర్చోవాలని చెప్పినా వినకుండా, దాదాపు 20 నిమిషాలు నిలబడే ఉన్నాడు. భజన పూర్తయిన తరువాత బర్జాత్యా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లి, తన మనసులోని బాధను దాచుకోలేకపోయాడు. సూరజ్ బర్జాత్యా వద్దకు వెళ్లిన వేళ, సల్మాన్ కంట కన్నీరు పెల్లుబకగా, అక్కడే ఉన్న అందరి హృదయాలూ బరువెక్కాయి. ఆపై ఎర్రబడిన కళ్లతో ఆయన తిరిగి వెళ్లిపోయాడు.