: ఇష్టమైనవి తినండి... కష్టపడి పతకాలు పట్టండి: ఒలింపిక్స్ ఆటగాళ్లకు మోదీ సూచన
అతి త్వరలో బ్రెజిల్ లోని రియోలో ప్రారంభమయ్యే ఒలింపిక్స్ లో ఇండియా ఆటగాళ్లకు ఇష్టమైన భారతీయ వంటకాలు సిద్ధం చేయబడ్డాయని, సరైన ఆహారం లభించదన్న ఆందోళన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆటగాళ్లు తమకు ఇష్టమైన పదార్థాలు తినవచ్చని, ఆపై కష్టపడి పతకాల వేటలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. రియోలో ఆటగాళ్లకు సంఘీభావం తెలుపుతూ, ఢిల్లీలోని ధ్యాన్ చంద్ మైదానంలో పరుగును ప్రారంభించిన ఆయన ప్రసంగించారు. గతంలో ఆటగాళ్ల కన్నా, వారితో వెళ్లిన అధికారులకు అధిక మొత్తంలో ఫీజులు చెల్లించారని, తమ ప్రభుత్వం అందరినీ సమానంగానే చూస్తుందని తెలిపారు. అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు తగు సమయం ఇవ్వాలనే ఆటగాళ్లను ముందుగానే పంపామని, ఇప్పటికే ఎంతో మంది రియోకు చేరుకున్నారని అన్నారు. 119 మంది ఆటగాళ్ల కోసం కేంద్రం రూ. 124 కోట్లను ఖర్చు పెడుతోందని గుర్తు చేసిన ఆయన, ప్రతి అథ్లెట్ తన శక్తి మేరకు రాణించి, ప్రపంచ క్రీడా సంగ్రామంలో భారత ఖ్యాతిని ఇనుమడింప చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా, భారత జట్టులోని ఆటగాళ్లు, తమ తమ విభాగాలను అనుసరించి రూ. 30 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకూ అందుకోనున్నట్టు అధికారులు తెలిపారు.