: 29 నెలల గరిష్ఠానికి బంగారం ధర... త్వరలోనే రూ. 33 వేలకు!


ఆభరణాల తయారీదారులు, ట్రేడర్ల నుంచి వచ్చిన కొనుగోలు మద్దతుతో పది గ్రాముల బంగారం ధర 29 నెలల గరిష్ఠ స్థాయిలో రూ. 31,340కి చేరగా, సమీప భవిష్యత్తులో ఇది రూ. 33 వేల వరకూ పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. శనివారం నాటి సెషన్ లో బంగారం ధర ఏకంగా రూ. 540 పెరిగింది. ఇదే సమయంలో వెండి ధర సైతం రూ. 220 పెరిగి కిలో రూ. 47,080కి చేరింది. వారాంతంలో డెలివరీ అయ్యే వెండి ధర కిలోకు రూ. 680 పెరగడంతో స్పాట్ ట్రేడింగ్ సిల్వర్ ధర మరింతగా పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ధరలు పెరగడం, డాలర్ బలహీనపడుతుండటం కారణంతో తమ పెట్టుబడులకు బంగారం సురక్షితమైనదన్న ఆలోచనలో ఇన్వెస్టర్లు భారీగా గోల్డ్ ట్రేడింగ్ చేస్తుండటమే ధరలను ప్రభావితం చేస్తోందని వివరించారు. కాగా, న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధర 1.2 శాతం పెరిగి ఔన్సుకు 1,357 డాలర్లను దాటింది. జూలై నెలలో బంగారం ధర 2.8 శాతం పెరిగింది. ఇక ఇండియాలో శ్రావణ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో శుభకార్యాల సందడి ప్రారంభమై, బంగారం అమ్మకాలు జోరుగా సాగుతాయని, దీంతో ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News