: నాడు అనుకూలంగా లేఖ ఇచ్చామని చెప్పారు, నేడు విభజన అన్యాయమంటున్నారు: చంద్రబాబుపై కవిత ఫైర్
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో సానుకూల స్పందన రాకపోవడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన సరిగా జరగలేదంటూ మరోసారి వ్యాఖ్యలు చేసిన అంశంపై టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు నిజామాబాద్‌లో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘నాడు చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చామని చెప్పారు.. నేడు విభజన అన్యాయమంటున్నారు’ అని అన్నారు. నిన్న జరిగిన ప్రత్యేక హోదాపై చర్చ అంశంతో కాంగ్రెస్, టీడీపీల వైఖరి ఏంటో స్పష్టమయిందని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణపై ఎప్పుడూ నోరెత్తని కాంగ్రెస్ జాతీయ నాయకులు నేడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాత్రం మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. ఎంసెట్-2 లీకేజీ అంశంపై ఆమె స్పందిస్తూ.. విద్యార్థులకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.