: నాడు, నేడు... పార్లమెంటులో ఒకే పరిస్థితి!.. ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ ఆగ్రహం!


ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు సత్ఫలితాలివ్వకపోవడంతో ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. నిన్న రాత్రే మీడియా ముందుకు వచ్చిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బీజేపీ సర్కారు వైఖరిపై నిప్పులు చెరిగారు. తాజాగా కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని లోటస్ పాండ్ లోని వైసీపీ కార్యాలయంలో మీడియా ముందుకు వచ్చిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హోదాపై గళం విప్పారు. పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణలతో కలిసి మీడియాతో మాట్లాడిన జగన్... చంద్రబాబు వైఖరిపై నిప్పులు చెరిగారు. ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరమని చెప్పిన జగన్ ... హోదా విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన సమయంలో పార్లమెంటులో నెలకొన్న పరిస్థితులే... నిన్న కేవీపీ బిల్లుపై చర్చ సందర్భంగానూ పునరావృతమయ్యాయన్నారు. సభ్యులను బయటకు పంపేసి, మైకులు కట్ చేసి విభజన బిల్లును ఆమోదింపజేసిన కాంగ్రెస్ పార్టీ... కేవీపీ బిల్లుపై చర్చ సందర్భంగా వాకౌట్ చేసిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా తిరుపతిలో ఏపీకి 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వడం, దానిని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అనువదించిన వీడియోను జగన్ మీడియా ముందు ప్రదర్శించారు. నాటి వేదికపై చంద్రబాబు ఉన్న విషయాన్ని కూడా జగన్ ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News