: నిజమైన పంచాంగ శ్రవణం... నాడు సిద్ధాంతి చెబితే పట్టించుకోని తెలంగాణ మంత్రుల వల్లే నేడు 'ఎంసెట్'కు చెడ్డపేరు!: పలువురి ఆరోపణ
ఏప్రిల్ 8... దుర్ముఖి నామ సంవత్సరం ప్రవేశించిన వేళ, రవీంధ్రభారతిలో యువ సిద్ధాంతి, పంచాంగకర్త చెప్పిన మాటలు నేడు నిజమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు రవీంధ్రభారతిలో ఆసీనులైన వేళ, పంచాంగ శ్రవణం చేసిన సంతోష్ కుమార్ శర్మ, ఈ ఏడు విద్యా, వైద్య రంగాల్లో అవినీతి పెరుగుతుందని, అక్రమాలు జరిగి చెడ్డ పేరు వచ్చే ఆవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తూ, సంతోష్ కుమార్ చెప్పిన ముందస్తు అంచనాలను ప్రస్తావించి, మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలు కాస్తంత జాగ్రత్తగా ఉండాలని నవ్వుతూ సరదా వ్యాఖ్యలు కూడా చేశారు. తాజా ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన తరువాత, నాటి పంచాంగ శ్రవణం నిజమైందని ఈ సందర్భంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆనాటి వీడియో క్లిప్పింగ్స్ లో పంచాంగకర్త సంతోష్ వ్యాఖ్యలను, కేసీఆర్ హెచ్చరికలను చూపిస్తూ, టీవీ చానళ్లలో ఇప్పుడు ప్రత్యేక వార్తలు వస్తున్నాయి. కాగా, ఎంసెట్-2 నిర్వహణ బాధ్యతలు తమవి కావంటే తమవి కావని అటు విద్యా శాఖ మంత్రి, ఇటు ఆరోగ్య శాఖా మంత్రులు చెబుతుండటం గమనార్హం.