: 125 కోట్ల మంది భారతీయుల్లో నాస్తికులు 33 వేల మందే.. దైవభక్తిలో తెలుగు ప్రజలే టాప్!
దేశంలో నాస్తికవాదం బహు తక్కువని తాజా నివేదిక ఒకటి చెబుతోంది. 125 కోట్ల పైచిలుకు భారతీయుల్లో నాస్తికుల సంఖ్య 33,304 మాత్రమేనని తేలింది. అంటే మొత్తం జనాభాలో ఇది 0.002 శాతమన్నమాట. 2011 జనాభా లెక్కలకు సంబంధించి తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని పేర్కొంది. విచిత్రం ఏంటంటే.. నాస్తికుల్లో ఎక్కువమంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఉండడం. గ్రామీణ ప్రాంతాల్లో 22,828 నాస్తికులు ఉండగా, పట్టణాల్లో 10,476 మంది నాస్తికులు ఉన్నారు. ఇక దేశంలోని మొత్తం నాస్తికుల్లో 17,597 మంది పురుషులు కాగా 15,707 మంది మహిళలు. తెలుగు ప్రజలకు దైవంపై అపారనమ్మకముందని, దైవభక్తి వారిలో చాలా ఎక్కువని నివేదిక పేర్కొంది. విభజనకు ముందు 2011లో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అప్పటి మొత్తం జనాభా 8.45 కోట్లు కాగా వీరిలో కేవలం 256 మందే తమను తాము నాస్తికులుగా చెప్పుకున్నారు. వీరిలో 62 మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా 194 మంది పట్టణ ప్రాంతాలకు చెందిన వారు. 256 మందిలో పురుషులు 143 మంది, మహిళలు 113 మంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ తర్వాత నాస్తికులు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 112 మందితో కర్ణాటక, 1,297 మందితో తమిళనాడు, 4,896 మందితో కేరళ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.