: అక్కడ దాక్కుంది బుర్హాన్ వనీ అని తెలిసి ఉంటే బతికేవాడు: కశ్మీర్ సీఎం మెహబూబా
కశ్మీర్‌లో ఈనెల 8న జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని భద్రతా దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. వనీ మృతి అనంతరం చెలరేగిన అల్లర్లు 20 రోజులు గడుస్తున్నా ఇంకా చల్లారడం లేదు. అయితే ఎన్‌కౌంటర్‌కు ముందు లోపల దాక్కున్నది బుర్హాన్ వనీ అని పోలీసులకు తెలిసి ఉంటే ప్రాణాలతో పట్టుకుని ఉండేవారని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో వనీ సహా ముగ్గురు తీవ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే. ఓ ఇంట్లో ముగ్గురు తీవ్రవాదులు దాక్కున్నట్టు మాత్రమే తమకు సమాచారం అందిందని పోలీసులు, ఆర్మీ అధికారులు చెప్పినట్టు విన్నానని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ ముగ్గురిలో ఒకరు బుర్హాన్ అని తెలిసుంటే అతను బతికిపోయేవాడని ఆమె పేర్కొన్నారు. అయితే ఎన్‌కౌంటర్ గురించి తనకెలా తెలుస్తుందని అన్న సీఎం అక్కడున్నది వనీ అని తెలిసి ఉంటే మాత్రం తప్పకుండా అతనికి ఒక్క చాన్స్ ఇచ్చి ఉండేవారని పేర్కొన్నారు.