: సమ్మెలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది!... నేడు మూతపడనున్న బ్యాంకులు!
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు దాని అనుబంధ బ్యాంకుల కార్యకలాపాలు నేడు స్తంభించనున్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సంబంధించిన కార్యకలాపాల పైనా ఈ ప్రభావం పడనుంది. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ నేడు ‘ద యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ ((యూఎప్ బీయూ) సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో ఎస్బీఐ సహా దాని అనుబంధ బ్యాంకులతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది కూడా విధులు బహిష్కరించనున్నారు. వెరసి చెక్కుల క్లియరెన్స్, నగదు డిపాజిట్, నగదు విత్ డ్రాయల్స్ తదితర కార్యకలాపాలపై పెను ప్రభావం పడనుంది. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనంపై పునరాలోచన చేయాలని ఈ నెల 26న ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం చీఫ్ లేబర్ కమిషనర్ ను కోరారు. అయితే ఆయన వినతికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో నేడు బ్యాంకుల సిబ్బంది సమ్మె అనివార్యం అయింది.