: ఈ చర్చ జరుగుతోందే నావల్ల... నాకు ఐదు నిమిషాల సమయం సరిపోదు: కేవీపీ రామచంద్రరావు
ఏపీకి ప్రత్యేకహోదాపై ఐదు నిమిషాలు మాట్లాడాలని కేవీపీకి డిప్యూటీ ఛైర్మన్ చెప్పగానే ఈ చర్చ జరుగుతోందే తనవల్ల అని, అలాంటిది తనకు ఐదు నిమిషాలు ఇవ్వడమేంటని ఆయన మండిపడ్డారు. రాజ్యసభకు వచ్చే ఏ బిల్లు అయినా బడ్జెట్ బిల్లేనని కేవీపీ రామచంద్రరావు తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, రాజ్యసభకు వచ్చే ప్రతి బిల్లు చిట్ట చివరన మనీ బిల్లుగా మారేదేనని అన్నారు. అలాంటప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా బిల్లు మాత్రమే మనీ బిల్లు ఎందుకు అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాను ప్రతిపాదించిన బిల్లును వెనక్కి తీసుకోనని ఆయన స్పష్టం చేశారు. తన బిల్లు ఎప్పుడు చర్చకు వస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కుట్రతోనే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. దర్మోరక్షితిః రక్షితః అని ఆయన ఆర్యోక్తిని ప్రస్తావించారు. రాజ్యసభ ధర్మాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పటి ప్రధానమంత్రి హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ప్రధాని ఇచ్చిన హామీలన్నీ చెత్తబుట్టలో పడేశారని ఆయన తెలిపారు. ప్రధాని ఇచ్చిన హామీని నెరవేర్చలేని సభ అంతా బోగస్ అని ప్రజలు అర్థం చేసుకుంటారని ఆయన తెలిపారు. తానేమీ ఎక్కువ అడగడం లేదని, గతంలో బీజేపీ ప్రజలకు ఏ హామీ ఇచ్చిందో అదే నెరవేర్చాలని అడుగుతున్నానని ఆయన స్పష్టం చేశారు. గతంలో మీరు చెప్పినట్టే ఏపీకి పదేళ్లహోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలకు చట్టసభలపై గౌరవం పోతుందని, తద్వారా రాజ్యాగంపై నమ్మకం పోతుందని, అది ప్రమాదకరమని ఆయన స్పష్టం చేశారు. మీరేమైతే ఏపీ ప్రజలకు ఇస్తామని చెప్పారో... వాటిని చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం అందజేయాలని ఆయన తెలిపారు.