: సినిమా హీరోను చేస్తామంటూ నిలువునా ముంచిన ఓం సాయిరాం ప్రొడక్షన్స్


ఓ కొత్త సినిమా తీస్తున్నామని ప్రకటనలు గుప్పించి, హైదరాబాద్ అపోలో ఆసుపత్రి రోడ్డులో కార్యాలయాన్ని ప్రారంభించి అమాయకుల నుంచి లక్షల రూపాయలు కాజేసిన ఓం సాయిరాం ప్రొడక్షన్స్ సంస్థపై, దాని యజమాని రాజేంద్ర నాయక్ పై పోలీసు కేసు నమోదైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన రాజేంద్ర అలియాస్ డీవీ సిద్ధార్థ్, ఫిలింనగర్ లోని అపోలో రోడ్డులో ఓం సాయిరాం ప్రొడక్షన్స్ కార్యాలయాన్ని తెరచి 'ప్రేమ + స్నేహం = సంగీతం' పేరిట జూన్ 19 నుంచి సినిమాను ప్రారంభిస్తున్నామని, హీరోలు కావాలని పేపర్లలో ప్రకటనలు ఇచ్చాడు. దీంతో మేడ్చల్ సమీపంలోని రాయిలాపురం గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ గౌడ్, తన ఇంట్లో సోదరి వివాహం కోసం దాచి ఉంచిన రూ. 4 లక్షలను దొంగచాటుగా తీసుకొచ్చి సిద్ధార్థకు ఇచ్చాడు. అదే ప్రాంతానికి చెందిన రాజశేఖర్, కిషోర్ లు మరో లక్ష ఇచ్చారు. వీరితో పాటు పలువురి నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఈ డబ్బులకు బాండ్ రాసిచ్చిన ఆ ప్రబుద్ధుడు, సినిమా ప్రారంభించాల్సిన రోజున మాయమాటలు చెప్పి తప్పించుకున్నాడు. ఆపై కార్యాలయాన్ని ఎత్తేసి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. తామంతా మోసపోయామని భావించిన బాధితులు, బంజారాహిల్స్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News