: పంజాబ్ ఇంతే... మాదకద్రవ్యాలు వాడి పోలీస్ ఉద్యోగానికి వచ్చి బుక్కైన 120 మంది
పంజాబ్ రాష్ట్రంలో నిషేధిత మాదక ద్రవ్యాల వాడకం ఎంతగా ఉందో తెలియజేసేందుకు మరో ఉదాహరణ ఇది. రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్ మెంట్ ప్రారంభమైన వేళ, అభ్యర్థులకు డోపింగ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు, మొత్తం 120 మంది డ్రగ్స్ వాడుతున్నట్టుగా తేల్చారు. హర్యానాలో ఇటీవల రిక్రూట్ మెంట్ జరిపినప్పుడు మత్తు పదార్థాలు వాడిన నలుగురు మృతి చెంది, వంద మందికి పైగా అస్వస్థతకు గురైన నేపథ్యంలోనే పంజాబ్ ప్రభుత్వం ఈ పరీక్షలు నిర్వహించింది. వీరి రక్త, మూత్ర నమూనాల్లో మార్ఫిన్, ప్రొఫోగ్జిఫిన్, కన్నాబిస్, ఆంఫీటమైన్ వంటి ఉత్ప్రేరకాల ఆనవాళ్లు లభ్యమయ్యాయి. వీరికి టెస్ట్-2 నిర్వహిస్తామని, అప్పుడు కూడా పాజిటివ్ వస్తే, ఆసుపత్రుల్లో చేర్చి చికిత్సతో పాటు కౌన్సెలింగ్ ఇస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు.