: బయటపడిన పాక్ ప్రధాని దొంగ నాటకం.. నవాజ్ షరీఫ్ దిష్టిబొమ్మలు తగలబెడుతున్న 'పీవోకే' ప్రజలు


జమ్ముకశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని సన్నాయి నొక్కులు నొక్కుతున్న పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ దొంగబుద్ధి బయటపడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఆయనపై ఇప్పుడు అక్కడి ప్రజలు భగ్గుమంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్న ప్రజలు షరీఫ్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. దీనంతటికీ కారణం ఇటీవల జరిగిన ఎన్నికలే. అక్కడ నిర్వహించిన ఎన్నికల్లో షరీఫ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ రిగ్గింగ్ చేసి గెలిచింది. 42 స్థానాలకు గాను 32 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇతర పార్టీలకు ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ రిగ్గింగ్ చేసి గెలిచారని ఆరోపిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. తమను పోలింగ్ బూతుల వద్దకు రాకుండా అడ్డుకున్న అధికారులు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, లేకుంటే అన్ని సీట్లు ఎలా వస్తాయని నిలదీస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆందోళనకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దొరికినవారిని దొరికినట్టు చితకబాది వదిలిపెడుతున్నారు. ఆందోళనకారులుపై భాష్పవాయువును ప్రయోగిస్తున్న పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. పీవోకే ప్రజల ఆందోళనపై స్పందించిన భారత్.. ఇప్పటికైనా పాక్ తన వైఖరి మార్చుకుంటే మంచిదని హితవు పలికింది. తమ వ్యవహారాల్లో అనవసర జోక్యం మాని సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలని సూచించింది. జమ్ముకశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని గగ్గోలు పెడుతున్న పాక్ ఇప్పుడేమని సమాధానం చెబుతుందని నిలదీసింది. ‘‘పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు అభివృద్ధికి దూరమయ్యారని, అందుకే తిరుగుబాటు చేస్తున్నారని పీఎంవో శాఖా మంత్రి జితేంద్రసింగ్ అన్నారు. భారత్ గురించి మాట్లాడడం మానుకోవాలని షరీఫ్‌కు సూచించారు. ‘‘పాకిస్థాన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ఆక్రమిత కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోంది. అందుకే జనం రోడ్ల మీదకు వస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లోని పాక్ మద్దతుదారులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి’’ అని అన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తుండగా పాక్‌లో అది కరవైందన్నారు. సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కశ్మీర్‌లో అల్లర్లను ప్రేరేపిస్తున్నారని జితేంద్రసింగ్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News