: ఏడు మండలాలు పోతే మాట్లాడని వారు... ఏడు గ్రామాల గురించి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు?: హరీష్ రావు


మూడవ పంట కోసం పోలవరం ప్రాజెక్టులో తెలంగాణలోని ఏడు మండలాలు కలిస్తే పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు, తెలంగాణలో నాలుగు జిల్లాలకు కరవు నుంచి విముక్తి కల్పించేందుకు నిర్మించనున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, మల్లన్నసాగర్ లో కేవలం ఏడు గ్రామాల ప్రజల నుంచి భూసేకరణ చేపడితే రాద్ధాంతం చేయడం సమంజసమా? అని ప్రశ్నించారు. అక్కడి రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అక్కడి రైతులకు 123 జీవో వల్ల లాభం జరుగుతోందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఆరు గ్రామాల ప్రజలు భూసేకరణకు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. పల్లెపహాడ్ గ్రామానికి చెందిన 150 మందితో మాట్లాడి వారిని ఒప్పించానని హరీష్ రావు చెప్పారు. ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో 30 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిందని ఆయన చెప్పారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి 5000 ఎకరాలు సేకరించామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News