: గిన్నిస్ బుక్ ఎక్కనున్న ఏనుగు ‘దాక్షాయణి’?
ప్రపంచలోనే ఎక్కువ కాలం జీవించి ఉన్న ఏనుగుగా కేరళలోని త్రివేండ్రంకు చెందిన ఏనుగు ‘దాక్షాయణి’ గిన్నిస్ రికార్డుల కెక్కనుంది. దాక్షాయణి వయసు 86 సంవత్సరాలు. ఈమేరకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) ఒక లేఖను గిన్నిస్ అధికారులకు రాసింది. ఈ సందర్భంగా టీబీడీ అధ్యక్షుడు ప్రయార్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ, 1949 లో ట్రావెన్ కోర్ రాజకుటుంబం వారు ఈ ఏనుగును టీబీడీకి బహూకరించారని, టీబీడీ పరిధిలో శబరిమల సహా 1,250 ఆలయాలు ఉన్నాయని చెప్పారు. టీబీడీ దగ్గర 33 ఏనుగులున్నాయని, ఆలయాల్లో జరిగే ఉత్సవాల నిమిత్తం వీటిని వినియోగిస్తామని చెప్పారు. దాక్షాయణి పేరుతో కేరళలో పోస్టల్ స్టాంపు విడుదల చేయనున్నామని, దాని పేరు గిన్నిస్ రికార్డుల్లోకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నామని గోపాలకృష్ణన్ తెలిపారు.