: ముంబైలో ‘పోకెమాన్’ తొలి యాక్సిడెంట్... రూ.20 వేలు వదిలించిన వైనం
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 దేశాల్లో ‘పోకెమాన్’ మొబైల్ గేమ్ ను వేలం వెర్రిగా ఆడుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాల బారినపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మన దేశంలో ఈ గేమ్ ఇంకా అధికారికంగా విడుదలకానప్పటికీ, దీనిపై మోజు కనపరుస్తున్న వారు, ఏదోఒక విధంగా డౌన్ లోడ్ చేసుకుని ఆడేస్తున్న వారూ లేకపోలేదు. ముంబైకు చెందిన ఇరవై ఆరేళ్ల జబ్బీర్ అలీ తన ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారు నడుపుతూ, ‘పోకెమాన్’ ఆడుతూ ప్రమాదానికి గురయ్యాడు. ఒక ఆటో వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో కారు దెబ్బతింది. దీంతో కారు గ్యారేజ్ కు పోవడం...రూ.20 వేల బిల్లు వదలడం కూడా జరిగిందని స్వయంగా జబ్బీర్ తన సోషల్ మీడియా పోస్ట్ లో చెప్పాడు. నిన్న తన కారులో ఇంటికి వెళ్లే సమయంలో ఈ గేమ్ ఆడానని, మొదటిసారే ఇంత నష్టం తెచ్చిందని ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం తన ఫొటోను సోషల్ మీడియాలో పెట్టానని చెప్పాడు. కారు నడుపుతూ, ‘పోకేమాన్’ గేమ్ ఆడటం వల్ల తనకు వచ్చిన ప్రతిఫలం ఇదీ అంటూ తన దెబ్బతిన్న కారు ఫొటోను పోస్ట్ చేశాడు. కాగా, ముంబైలో ‘పోకేమాన్’ నమోదు చేసిన తొలి యాక్సిడెంట్ ఇదే కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.