: ఇండియాలోని కోటీశ్వరుల సంఖ్య, వారి ఆస్తులపై తాజా నివేదిక
ఇండియాలో అల్ట్రా హై నెట్ వర్త్ ఇన్డివిడ్యువల్స్ (యూహెచ్ఎన్ఐ) సంఖ్యలో వృద్ధి నిదానించిందని, 2015-16 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 1.46 లక్షల మంది ఈ జాబితాలో ఉన్నారని కోటక్ మహీంద్రా బ్యాంకు తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో రూ. 25 కోట్లకు పైగా ఆస్తిపాస్తులున్న వారిని పరిగణనలోకి తీసుకుని నివేదిక తయారు చేయగా, 2014-15తో పోలిస్తే వీరి సంఖ్య 5 శాతం పెరిగిందని, వీరందరి సంయుక్త ఆస్తి రూ. 135 లక్షల కోట్ల రూపాయలని తెలిపింది. వచ్చే ఐదేళ్లలో బడాబాబుల సంఖ్య 2.94 లక్షలకు చేరుతుందని, అందరి ఆస్తి సంయుక్తంగా రూ. 319 లక్షల కోట్లకు చేరుతుందని బ్యాంకు అంచనా వేసింది. వివిధ రంగాల్లో వృద్ధి, నూతన పెట్టుబడి మార్గాలు, ఇన్వెస్ట్ మెంట్ పై అధిక రాబడులు తదితరాలు చిన్న నగరాల్లోని వారిని కోటీశ్వరులుగా మార్చనున్నాయని అంచనా వేసింది. ప్రొఫెషనల్ సేవల సంస్థ ఈవై, కోటక్ మహీంద్రా వెల్త్ లు సంయుక్తంగా ఈ నివేదికను తయారు చేశాయి. కోటీశ్వరులుగా ఉన్న 1.46 లక్షల మందిలో సగానికి పైగా 40 ఏళ్ల లోపు వారేనని, సమీప భవిష్యత్తులో వీరందరి ఆస్తీ మరింతగా పెరగనుందని రిపోర్టులో వెల్లడైంది. వీరిలో 39 శాతం మంది ఈక్విటీల్లో పెట్టుబడులతో లాభాలను అందుకున్నారని, 28 శాతం మంది నిర్మాణ రంగంలో, 22 శాతం మంది డెట్ ఇన్వెస్ట్ మెంట్స్ చేశారని, 11 శాతం మంది పెట్టుబడులు పెట్టేందుకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారని నివేదిక తెలిపింది.