: గట్టిగా మాట్లాడితే పబ్లిసిటీ వస్తుందనుకుంటున్నారు: ప్రతిపక్షాలపై తెలంగాణ మంత్రి తలసాని ఫైర్
మల్లన్నసాగర్ ప్రాజెక్టు అంశంపై విపక్షాలు అధికార టీఆర్ఎస్పై విమర్శలు గుప్పిస్తోన్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విపక్షాలు డ్రామా కంపెనీల్లా తయారయ్యాయని, గట్టిగా మాట్లాడితే పబ్లిసిటీ వస్తుందనుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ఆరు నూరైనా ప్రాజెక్టులు కట్టితీరుతామని ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌కి రైతుల పట్ల మాట్లాడే నైతిక హక్కు లేదని తలసాని అన్నారు. ప్రతి కార్యక్రమానికీ ప్రతిపక్ష పార్టీల నేతలు అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు కట్టొద్దా? రైతులు బాగుపడొద్దా? అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు తెలంగాణ రైతుల సమస్యలను పట్టించుకోలేదని ఆయన అన్నారు. టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల పేరుతో మోసం చేశాయని, ఎన్నో డ్రామాలు ఆడాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంపై పలువురు అనవసర ఆరోపణలు గుప్పిస్తున్నారని, కాంట్రాక్టర్లకు ముందస్తు చెల్లింపులు చేసిన దాఖలాలు లేవని తలసాని చెప్పారు. తెలంగాణ చేపడుతోన్న ప్రాజెక్టులపై కోర్టుల్లో కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తలపెట్టిన ప్రాజెక్టులు కట్టి తీరుతామని నొక్కి చెప్పారు. రైతుల సంక్షేమాన్ని తమ ప్రభుత్వం మరవబోదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తోందని, వారికి రోజుకి 9 గంటల విద్యుత్ ను అందిస్తోందని అన్నారు