: పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు: భట్టీవిక్రమార్క ఆగ్రహం
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే క్రమాన్ని అడ్డుకోవడం సరికాదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టీవిక్రమార్క ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో నిర్మించనున్న మల్లన్నసాగర్ ముంపు బాధితులపై జరిగిన పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ హైదరాబాద్లోని గాంధీభవన్ నుంచి మల్లన్నసాగర్కు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించుకునేందుకు అందరూ కదలి రావాలని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలకు ప్రజలే బుద్ధి చెబుతారని, తమకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ వద్ద పోలీసులతో దెబ్బలు తిన్న వారిని పరామర్శించేందుకు వెళుతోన్న తమపై ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న తీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైందని అరెస్టయిన కాంగ్రెస్ నేతలు గండ్ర వెంకటరమణారెడ్డి, జగ్గారెడ్డి, మల్లు రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ గుండెల్లో భయం రేగుతోందని వారు అన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో టీఆర్ఎస్ ఏం సాధిస్తుందని వారు ప్రశ్నించారు. పరామర్శించడానికి బయలు దేరితే పోనివ్వమంటూ పోలీసులు అడ్డుకున్నారని, ప్రజాస్వామ్య విలువకే వారు మచ్చ తెచ్చేలా ప్రవర్తించారని వారు అన్నారు.