: ప్రియ నేస్తం దూరమవడంతో, అన్నం నీళ్లూ ముట్టక డిప్రెషన్ లోకి వెళ్లిన శునకం... 26/11 ముంబై దాడుల హీరో 'సీజర్'కు చికిత్స!
సీజర్ (12)... ముంబైపై ఉగ్రవాదులు తెగబడ్డ వేళ, ఉగ్రవాదులను గుర్తించడంలో సహకరించి హీరోగా నిలిచిన పోలీస్ డాగ్. సీజర్ తో పాటు టైగర్ అనే మరో శునకం సైతం ముంబై పోలీసులకు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తోంది. సీజర్, టైగర్ లు రెండు మంచి స్నేహితులు. రెండూ కలిసే ఉండేవి. పదవీ విరమణ తరువాత కూడా ఒకే చోట వీటిని ఉంచగా, ఇటీవల టైగర్ మరణించడంతో, సీజర్ డిప్రషన్ లోకి వెళ్లిపోయింది. దీంతో టైగర్ కు సంరక్షకుడిగా ఉన్న ఫిజాహ్, దాన్ని వెటర్నరీ ఆసుపత్రికి తరలించాడు. టైగర్ మరణించడంతో డీలా పడ్డ సీజర్, లేచి నిలబడేందుకు కూడా ఇష్టపడటం లేదు. తిండి మానేసిందని తెలిపాడు. సీజర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, దాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని వైద్యులు వెల్లడించారు. ఈ రెండూ లాబ్రడార్ రకానికి చెందిన శునకాలని, వీటితో పాటు మ్యాక్స్, సుల్తాన్ అనే మరో రెండు శునకాలు గోరేగాం బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ లో విధులు నిర్వహించాయని, ముంబై దాడుల సమయంలో వీటి సేవలు మరువలేనివని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మ్యాక్స్, సుల్తాన్ లు గతంలోనే మరణించగా, ఇప్పుడు టైగర్ కూడా దూరం కావడాన్ని సీజర్ తట్టుకోలేక పోతోందని అధికారి ఒకరు తెలిపారు.