: ఉభయ గోదావరి జిల్లాల్లో పులస ఫీవర్!... కిలో రూ.4 వేలకు చేరిన సీజనల్ ఫిష్ ధర!
ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలను పులస ఫీవర్ చుట్టుముట్టేసింది. ఏడాదిలో కేవలం రెండు నెలలు మాత్రమే... అది కూడా జూలై, ఆగస్టు మాసాల్లో మాత్రమే లభించే ఈ చేప రుచే వేరు. మాంసాహారంలో చేపల పులుసుకు ప్రత్యేక స్థానముంటే... చేపల పులుసులో పులస వంటకానికి మరింత ప్రత్యేకత వుంది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో దొరుకుతున్న ఈ సీజనల్ ఫిష్ ను రుచి చూసేందుకు మాంసాహారులు బారులు తీరుతున్నారు. ఇదే అదనుగా మత్స్యకారులు కూడా పులస ధరలను అమాంతం పెంచేశారు. రెండేళ్ల క్రితం దాకా కిలో పులస ధర రూ.1,000 కంటే తక్కువ ఉండగా, ఈ ఏడాది ఆ రేటు ఒక్కసారిగా రూ.4 వేలకు చేరింది. కిలోకు రూ.4 వేలు పెట్టేందుకు సిద్ధమైనా పులస దొరకడం లేదంటూ మాంసాహారులు గగ్గోలు పెడుతున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలు, ఆ జిల్లాలకు పొరుగు జిల్లాల్లోని ప్రముఖ హోటళ్లన్నీ పులస పులుసును ప్రత్యేక వంటకంగా అందిస్తున్నాయి. అక్కడ కూడా రేట్లు అదిరిపోతున్నా... పులస పులుసుకు ఏమాత్రం డిమాండ్ తగ్గడం లేదట. వచ్చే నెలాఖరు వరకు మాత్రమే లభించే ఈ పులసను ఒక్కసారైనా రుచి చూడాలన్న మాంసాహారుల వాంఛే ఇందుకు కారణమన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇక ఉభయ గోదావరి జిల్లాలను చుట్టేసిన పులస ఫీవర్ పై పలు తెలుగు న్యూస్ ఛానెళ్లు ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తున్నాయి.