: గుజరాత్ లో ఎస్సైని చితకబాదిన స్థానికులు!... వైరల్ గా మారిన వీడియో!
గుజరాత్ లోని సూరత్ లో చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. సూరత్ కు చెందిన ఓ యువకుడి హత్యకు సంబంధించిన వివాదంలో ఎస్సై స్థాయి పోలీసు అధికారిని అక్కడి స్థానికులు చితకబాదారు. పట్టపగలు బహిరంగంగా జనమంతా చూస్తుండగానే జరిగిన ఈ దాడిని అక్కడి ఓ వ్యక్తి సాంతం వీడియో తీశాడు. ప్రస్తుతం జాతీయ మీడియాలో ప్రధానంగా ప్రసారమవుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం... యువకుడి హత్యపై చోటుచేసుకున్న వివాదంలో ఎస్సైని చుట్టుముట్టిన స్థానికులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆగ్రహావేశాలతో ఊగిపోయిన కొందరు యువకులు ఆయనపై చేయి చేసుకున్నారు. ఒకరు, ఇద్దరు... ఆ తర్వాత మరికొందరు ఎస్సైపై దాడి చేశారు. దీంతో జనాన్ని ఒంటిచేత్తో చెదరగొట్టిన సదరు పోలీసు అధికారి చేతిలో ఉన్న కర్రతో స్థానికులను చెల్లాచెదురు చేశారు. ఆ తర్వాత మరోమారు ఎస్సై పైకి దూసుకువచ్చిన యువకులు, మహిళలు ఆయనపై మూకుమ్మడి దాడికి దిగారు. దీంతో ఆయన కిందపడిపోయారు. ఆ తర్వాత తిరిగి పైకి లేచిన ఆయనపై మరోమారు దాడికి దిగగా, ఎస్సై నిస్సహాయులైపోయారు. అప్పటిదాకా జనం దాడిని తిప్పికొట్టిన ఆయన వరుస దాడులతో బిక్కచచ్చిపోయారు.