: డోన్ లో ఫ్యాక్షన్ హత్యకు కుట్ర!... భగ్నం చేసిన పోలీసులు, మూడు బాంబులు స్వాధీనం!
ఫ్యాక్షన్ ఖిల్లా కర్నూలు జిల్లాలో పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేసినా మరో హత్య జరిగి ఉండేదే. జిల్లా ఎస్పీ రవికృష్ణ ఆదేశాలతో ఫ్యాక్షన్ కక్షలపై నిఘా వేసి ఉంచిన జిల్లా పోలీసులు తమదైన శైలిలో ఫ్యాక్షన్ హత్యకు చెక్ పెట్టేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా జిల్లాలోని డోన్ పోలీసులు రేపో, మాపో జరగనున్న ఓ హత్యను నిలువరించగలిగారు. వివరాల్లోకెళితే... డోన్ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన మహానందరెడ్డి అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి హత్యలో కీలక నిందితుడిగా ఉన్నాడు. తాజాగా మహానందరెడ్డిని హత్య చేసేందుకు శ్రీనివాసరెడ్డి బంధువర్గం పక్కా ప్రణాళిక రచించుకుంది. ఈ క్రమంలో మహానందరెడ్డి హత్యకు అవసరమని భావించిన మారణాయుధాలతో పాటు బాంబులను కూడా నిందితులు సమీకరించుకున్నారు. మహానందరెడ్డిని హత్య చేసేందుకు ముగ్గురు వ్యక్తులు కూడా రంగంలోకి దిగేశారు. అయితే ఫ్యాక్షన్ కక్షలపై అప్పటికే గట్టి నిఘా పెట్టిన డోన్ పోలీసుల చెవికి ఈ విషయం చేరింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారు సేకరించి పెట్టుకున్న మూడు బాంబులను కూడా స్వాధీనం చేసుకున్నారు.