: షారుఖ్ ఖాన్‌కి ఆదాయ పన్ను శాఖ నోటీసులు
కేంద్రం ఆదాయం డిక్లరేషన్ పథకం(ఐడీఎస్)లో భాగంగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పన్ను ఎగ్గొడుతోన్న వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. గత ఆర్థిక సంవత్సరానికి విదేశీ సంస్థల్లో పెట్టుబడులు తదితర ఆదాయ వివరాలను ప్రకటించని వారికి నోటీసులు పంపిస్తోంది. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కి కూడా నోటీసులు పంపింది. అప్రకటిత ఆస్తుల అంశంలో షారుఖ్‌ని వివరాలు తెలపాలని నోటీసుల్లో పేర్కొంది. ఐటీ చట్టం సెక్షన్ 131 కింద బెర్ముడా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, దుబాయ్ తదితర ప్రదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను షారుఖ్ వెల్లడించాల్సిదేనని తెలిపింది. షారుఖ్‌తో పాటు మరికొంతమంది ఇండస్ట్రీ పెద్దలకు కూడా ఐటీ నుంచి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. ఆదాయం డిక్లరేషన్ పథకం స్కీం విజయవంతం కావడానికి కేంద్రం పలు చర్యలు తీసుకుంటుందని, అప్రకటిత ఆస్తులను పేర్కొనని వారిపై కఠినంగా ఉందనే సందేశాన్ని పంపుతోందని సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ దిలీప్ లాఖానీ మీడియాకు తెలిపారు. ఆదాయపన్ను శాఖ నిబంధనలను షారూక్ ఉల్లంఘించారా? అనే అంశంపై స్పష్టత లేదు. షారుఖ్ నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత ఏడాది మే నెలలో కోల్కతా నైట్ రైడర్స్ షేర్స్ అమ్మకాల విషయంలో వివరాలను తీసుకున్న విషయం విదితమే.