: తొలి టెస్టు కోహ్లీ సేనదే!... ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో టీమిండియా జయకేతనం!
వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా సత్తా చాటుతోంది. నాలుగు టెస్టుల సిరీస్ కోసం కరీబియన్ దీవుల్లో అడుగుపెట్టిన కోహ్లీ సేన ఆ దేశంలోని అంటిగ్వాలో నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన తొలి టెస్టును కైవసం చేసుకుంది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లోనే 8 వికెట్ల నష్టానికి 566 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఈ భారీ ఇన్నింగ్స్ లో జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి డబుల్ సెంచరీతో విరుచుకుపడగా, స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్ లోనే తొలి సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండిస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 243 పరుగులు సాధించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో మరింత పేలవంగా ఆడి 231 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో కోహ్లీ సేన విజయకేతనం ఎగురవేసింది. టీమిండియా బ్యాటింగ్ లో మునుపెన్నడూ లేనంతగా సత్తా చాటిన అశ్విన్ తన కెరీర్ లోనే సెంచరీ నమోదు చేశాడు. మొత్తం 253 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 44.66 సగటుతో 113 పరుగులు చేశాడు. బ్యాటుతో సత్తా చాటిన అశ్విన్... బౌలింగ్ లోనూ రాణించాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 17 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి సింగిల్ వికెట్ తీయని అశ్విన్... ఆతిథ్య దేశ జట్టు స్కోరు బోర్డును మాత్రం కట్టడి చేయగలిగాడు. ఇక విండీస్ రెండో ఇన్నింగ్స్ లో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ ను అశ్విన్ కుప్పకూల్చాడు. మొత్తం 25 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన అశ్విన్... ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. వెరసి టీమిండియా ఘన విజయానికి బాటలు పరిచాడు. ఫలితంగా అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.